ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్లారు. 3 రోజులపాటు అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అయితే అమెరికాలో మోదీ దిగడానికి కొన్ని గంటల ముందు అమెరికా చేసిన పని ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఖలిస్తాన్ అనుకూల గ్రూపులతో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ అధికారులు సమావేశం జరపడం గమనార్హం. అమెరికా గడ్డపై విదేశాల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని వైట్‌హౌస్ ప్రతినిధులు.. ఖలిస్తాన్ గ్రూపులకు హామీ ఇవ్వడం సంచలనంగా మారింది. అంతేకాకుండా అమెరికాలో అమెరికన్ పౌరుల హాని నుంచి కూడా రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
భారత్‌లోనూ, విదేశాల్లోనూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఖలిస్తానీ గ్రూపులకు, ఉగ్రవాదులకు.. కెనడా, అమెరికా లాంటి దేశాలు ఆశ్రయాలు కల్పిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ఏకంగా వైట్‌హౌస్ ప్రతినిధులతో ఖలిస్తానీ గ్రూపులకు చెందిన నేతలు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికన్ సిక్కు కాకస్ కమిటీకి చెందిన ప్రీత్‌పాల్ సింగ్‌తో పాటు సిక్ కొలీషన్ అండ్ సిక్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ ఫండ్-సాల్డెఫ్ ప్రతినిధులు వైట్‌హౌజ్ అధికారులతో సమావేశం అయ్యారు. అమెరికన్ అధికారులు సిక్కు అమెరికన్లను రక్షించడంలో అప్రమత్తంగా ఉన్నందుకు ధన్యవాదాలు అని ప్రీత్‌పాల్ సింగ్ అంతకుముందు ట్వీట్ చేయడం గమనార్హం. సిక్కు వేర్పాటువాదులతో అమెరికా జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం చర్చకు దారి తీసింది.
ఇక సిక్కు వేర్పాటువాది, భారత్ ఉగ్రవాదిగా పేర్కొన్న హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు.. సాల్డెఫ్ పూర్తిగా మద్దతు ఇస్తోంది. మరో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యాయత్నం కుట్రలో భారత్ ప్రమేయం ఉందని అమెరికా న్యాయశాఖ ఇటీవల చేసిన ఆరోపణలు తీవ్ర దుమారానికి కారణం అవుతున్నాయి. ఈ కేసులో భారత ప్రభుత్వంపై, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌పై న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ ఫర్ డిస్ట్రిక్ట్ కోర్టు తాజాగా సమన్లు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ సమన్లలో భారత ప్రభుత్వంతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్-రా మాజీ చీఫ్ సమంత్ గోయెల్.. రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, మరో భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా పేర్లు ఉన్నాయి. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యాయత్నం కేసులో 21 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆ సమన్లలో కోరింది. అయితే ఈ సమన్లను భారత్ కొట్టేసింది.
ఇక అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ డెలావర్ క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనడంతో పాటు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’’ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఇక రేపు న్యూయార్క్‌లో నిర్వహించనున్న "మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్" కార్యక్రమానికి ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్‌ఏ తెలిపింది. ఈ కార్యక్రమానికి దాదాపు 14వేల మంది హాజరు కానున్నట్లు తెలుస్తోంది.