విదేశాల నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ఇచ్చే గ్రీన్ కార్డుకు సంబంధించి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ జో బైడెన్ ప్రభుత్వం భారీ ఊరటను కల్పించింది. గ్రీన్ కార్డు వ్యాలిడిటీ ముగిసిన తర్వాత మళ్లీ రెన్యూవల్ చేసుకునేందుకు ఇప్పటివరకు ఉన్న గడువును మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల చాలా మంది గ్రీన్ కార్డు రెన్యూవల్ కోసం ఎదురుచూస్తున్న వారికి సువర్ణావకాశం దక్కినట్లయింది. గతంలో గ్రీన్ కార్డు గడువు ముగిసినప్పటికీ.. మరో 2 ఏళ్ల పాటు దాని వ్యాలిడిటీను పెంచేవారు. తాజా పెంపుతో మొత్తంగా 3 ఏళ్ల పాటు పెంచినట్లు అయింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వ, వలసల సేవల సంస్థ-యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది.
సాధారణంగా అమెరికాలో నివసించే గ్రీన్ కార్డు కలిగి ఉన్న వారు ప్రతీ 10 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ 10 ఏళ్ల గడువు పూర్తి కాకముందే.. కనీసం 6 నెలల ముందే ఐ-90 ఫామ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఇలా గ్రీన్ కార్డు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి దాని వ్యాలిడిటీని 24 నెలలు పొడిగిస్తూ రిసీట్ నోటీసు ఇస్తారు. దీంతో వారి గ్రీన్ కార్డు గడువు దాటిపోయినా.. ఈ నోటీసును చూపించి వారు చట్టబద్ధంగానే అమెరికాలో నివసించే అవకాశం ఉంటుంది. కొత్త గ్రీన్ కార్డు జారీ అయ్యే వరకు ఉద్యోగాలు, ప్రయాణాల సమయంలో గ్రీన్ కార్డు స్థానంలో ఈ నోటీసును దాన్ని లీగల్ స్టేటస్ ప్రూఫ్‌గా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది.
ఈ క్రమంలోనే గ్రీన్ కార్డు రెన్యూవల్ సమయం పెరిగిపోతుండటంతో తాజాగా అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గ్రీన్‌కార్డు అదనపు వ్యాలిడిటీని 36 నెలలకు పెంచుతూ తాజాగా యూఎస్‌సీఐఎస్ నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త గ్రీన్ కార్డుల కోసం వేచి చూసే వారు మరో ఏడాది పాటు చట్టబద్ధంగానే అమెరికాలో శాశ్వత నివాస హోదాను పొందేందుకు అవకాశం ఉంటుంది.
అయితే ఈ పెంపు అనేది కండిషనల్ రెసిడెన్సీ కింద జారీ చేసిన గ్రీన్ కార్డులకు మాత్రం వర్తించవని అధికారులు వెల్లడించారు. ఈ కండిషనల్ రెసిడెన్సీ తీసుకునేవారి గ్రీన్ కార్డుల గడువు 2 ఏళ్ల పాటే ఉంటుంది. దీంతో ఈ కండిషనల్ రెసిడెన్సీ గ్రీన్ కార్డులు తీసుకున్నవారు ముందుగా నివాస హోదాపై ఉన్న కండీషన్స్ తొలగించుకునేందుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గ్రీన్ కార్డు గడువు తీరే 90 రోజుల్లోపు ఈ దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ వారి దరఖాస్తు అనుమతి పొందితే.. వారికి 10 ఏళ్ల కాలానికి గ్రీన్ కార్డును జారీ చేస్తారు.