భర్తతో కలసి బస్సులో వేరే రాష్ట్రానికి వెళ్తున్న వివాహితను, ఆమె పదినెలల చిన్నారితో సహా కిడ్నాప్ చేసిన ఘటన శనివారం రాత్రి ముదినేపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ముదినేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన కుమార్తెను కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్‌కు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేసింది. వారికి పది నెలల పాప ఉంది. కొద్ది రోజుల క్రితం రాయచూర్ నుంచి ఆమె తన భర్త, కుమార్తెతో కలసి పుట్టింటికి వచ్చింది. తిరిగి ఈ నెల 21వ తేదీ రాత్రి రాయచూర్ వెళ్లేందుకు ముదినేపల్లిలో బస్ స్టేషన్లో బస్సు ఎక్కారు. అయితే గ్రామానికి చెందిన అచ్యుత రమేష్ అనే యువకుడు బస్ స్టేషన్‌కు వచ్చి ‘రాత్రి సమయంలో ప్రయాణం చేయవద్దని మీ అమ్మ మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మని తనను పంపింద’ని చెప్పగా, వారు బస్సు నుంచి దిగిపోయారు. బైక్‌పై ఆమె తన చిన్నారితో సహా ఎక్కిన అనంతరం ఆమె భర్త ఎక్కుతుండగా, రమేష్ స్పీడ్‌గా వెళ్లిపోయాడు. విషయాన్ని అల్లుడు తన అత్తకు తెలియజేయగా ఆమె ఆదివారం ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో రమేష్ అనే వ్యక్తి తన కుమార్తెను, మనుమరాలిని కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి ఎస్ఐ వెంకట్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.