జాతీయ రహదారి బలియాపుట్టుగ జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమార్తెలు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలం జలంత్రకోట గ్రామానికి చెందిన మూలి ప్రదీప్, తన ఐదేళ్ల కుమార్తె స్వాతితో కలసి పోలేరు గ్రామంలో జరిగిన ఒక శుభకార్యక్రమానికి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తిరిగి గ్రామానికి వస్తున్న క్రమంలో బలియాపుట్టుగ జంక్షన్ సమీపంలో గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొంది.
ఈ ప్రమాదంలో ప్రదీప్ తలకు బలమైన గాయంతోపాటు ఎడమ కాలు విరిగిపోయింది. కుమార్తె స్వాతి తల, కాలికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వీరిని ద్విచక్రవాహనంపై సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆంబులెన్స్‌లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు.