ఏపీలోని వరద బాధితులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో వరదలు సంభవించాయి. దీంతో లక్షలాది కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ప్రాణ నష్టంతో పాటుగా, భారీగా ఆస్తి, పంట నష్టం కూడా సంభవించింది. అయితే వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం కూడా ప్రకటించింది. తాజాగా ఈ వరద సాయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ గైడెలైన్స్ ప్రకారం ఇవ్వాల్సిన దానికంటే అదనంగా సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఎస్డీఆర్ఎఫ్ నిర్దేశించిన మొత్తం కంటే వరద బాధితులకు అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతూ జీవో ఇచ్చింది. అదనపు ఆర్థిక సాయం కోసం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచుతూ ఏపీ రెవెన్యూ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
మరోవైపు వరదల్లో నష్టపోయిన వారి కోసం సెప్టెంబర్ 17న సీఎం చంద్రబాబు నాయుడు ప్యాకేజీ ప్రకటించారు. 179 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉండే బాధితుల కోసం ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో ఇల్లు నీట మునిగిన వారితో పాటుగా, చిరు వ్యాపారులు, రైతులు, కుటీర పరిశ్రమలు, వరదల్లో చనిపోయిన పశువులు, దెబ్బతిన్న వాహనాలకు కూడా పరిహారం ప్రకటించారు. అయితే వరదల్లో ఇల్లు మునిగిపోయిన వారికి ఎస్డీఆర్ఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం.. 11 వేలు ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్ 17వ తేదీ ప్రకటనలో సీఎం చంద్రబాబు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండి ఇల్లు మునిగిపోయిన వారికి రూ.25 వేలు వరద సాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే మొదటి అంతస్తులో ఉన్న వారికి పదివేలు.. షాపులు దెబ్బతిన్న వారికి పాతికవేలు చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచుతూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు వరద బాధితులకు ఈ నెల 25న పరిహారం అందించనున్నారు. దీనిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ సచివాలయాల పరిధిలో ఇప్పటికే ఎన్యుమరేషన్ కూడా పూర్తి చేశారు. అర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. అర్హుల జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచిస్తున్నారు. సలహాలు, అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది జాబితాలను సిద్ధం చేయనున్నారు. ఈ జాబితాల ప్రకారం సెప్టెంబర్ 25న వరద బాధితుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేయనున్నారు.