టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీని రౌడీరాజ్యం చేసిందని, దీనికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తో పాటు, బీజేపీ నాయకత్వం వహిస్తోందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పవన్‌కళ్యాణ్‌కు చాలా దగ్గర మనిషి అన్న ఆయన.. నానాజీని ఎవరేమైనా అంటే నన్ను అన్నట్లే అని పవన్ చెప్పారన్నారు. కాకినాడలో నానాజీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తను చెప్పిందే జరగాలన్నట్లు వ్యవహరిస్తున్నాడన్నారు. రంగరాయ మెడికల్ కాలేజీలో దళిత ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ మాట్లాడిన బూతులు, దాడికి సంబంధించి సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని గుర్తు చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు సోమవారం మీడియాతో మాట్లాడారు. నానాజీ దళితులు కన్నెర్ర చేస్తే నువ్వెక్కడ ఉంటావు?. ఆయనకు మద్దతుగా కలెక్టర్, ఎస్పీ వ్యవహరిస్తారా?. ఇదేనా మీ డ్యూటీ?. ఇంత దారుణంగా వ్యవహరిస్తే కేసులు రాజీ చేయడమేనా మీ పని?. ఇదేమైనా రౌడీరాజ్యమా? అని గట్టిగా నిలదీసిన జూపూడి.. వాటన్నింటికీ సీఎం, డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితుల తరపున నిలబడతామన్న ఆయన, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పారు.
ఇంత జరిగినా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించకపోవడాన్ని జూపూడి తప్పుబట్టారు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది రౌడీరాజ్యం చేయడానికి కాదు.. మీ తోకలు ప్రజలే కట్ చేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మరోవైపు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీని చించేయడం అత్యంత నీచమన్న జూపూడి, మీకు రాజ్యంగ నిర్మాత అంటే ఎందుకంత ద్వేషమని నిలదీశారు. ‘రఘురామ దళితుల సహనాన్ని పరీక్షించకు, దళితులు వైయస్ఆర్‌సీపీ వెంట ఉన్నారనే మీకు కడుపుమంటా?. మా ఓట్లు మేం మాకు నచ్చిన వారికి వేసుకునే హక్కు లేదా?. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. అది మరిచిపోయావో తాట తీస్తారు జాగ్రత్త’.. అని జూపూడి హెచ్చరించారు.