టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన 100 రోజుల్లో అనేక మంచి కార్యక్రమాలు చేపట్టామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలోని పేరారెడ్డిపల్లి గ్రామంలో ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డులో కల్తీ నెయ్యి వాడి గత పాలకుల దోపిడి చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పరీక్షలు నిర్వహిస్తే నివేదికలలో జంతువుల కొవ్వు ఉందని స్పష్టం చేశాయన్నారు. మూడు సంవత్సరాలు అనుభవం ఉండాల్సి ఉంటే సంవత్సరం కూడా అనుభవ లేని కంపెనీలకు కట్టపెట్టారన్నారు.
జగన్ ముఖ్య మంత్రి అవడానికి సొంత బాబాయినే హత్య చేశారని... తిరుమలను దోచుకోమని మరో బాబాయిని పంపించారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంత అపచారం జరిగి ఉంటే ఏమి తెలియని నంగనాచిలా ప్రధానికి లేఖ రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒక చీటర్..బ్లాక్ మెయిలర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది మనోభావాలను దెబ్బ తీశారని జగన్పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.