తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ పై వస్తున్న కథనాలపై చంద్రబాబు ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం లోపు అందుకు సంబంధించిన జీవోను జారీ చేయాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఇదే అంశంపై సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా సమావేశమై చర్చించారు. మంగళవారం ఉదయం మరోసారి సీఎం చంద్రబాబుతో వీరిద్దరు భేటీ కానున్నారు. ఈ భేటీలో సిట్ చీఫ్‌గా ఎవరిని నియమించాలనే అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుస్తుంది. సిట్ చీఫ్‌గా సీనియర్ ఐజీ అధికారిని నియమించనున్నారు.
ఈ సిట్ బృందంలో ఇద్దరు డీఐజీలు, ఇద్దరు ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతోపాటు పలువురు కానిస్టేబుళ్లు ఉండనున్నారు. ఇప్పటికే ఇద్దరు సీనియర్ ఐజీ అధికారుల పేర్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆ క్రమంలో ఒకరిని ఎంపిక చేసే అవకాశముందని తెలుస్తుంది. దీంతో సిట్‌కు నేతృత్వం వహించేది ఎవరనే విషయం కొన్ని గంటల్లో తెలిపోనుంది. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన నిజనిజాలు వెలుగులోకి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ ఘోర అపచారం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం.. సోమవారం శాంతి హోమం నిర్వహించింది. అనంతరం శ్రీవారు కొలువు తీరిన ఆనంద నిలయంతోపాటు తిరుమాడ వీధుల్లో ఆయన పూజాలు సంప్రోక్షణ నిర్వహించారు.