దీక్ష తీసుకునే సందర్భంలో పవన్ కల్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చర్చికి, మసీదులో జరిగితే జగన్ ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. మరి హిందూ ధర్మానికి జరిగితే ఎందుకు వెనుకేసుకొస్తున్నారని నిలదీశారు. కేబినెట్, అసెంబ్లీలో దీనిపై చర్చ జరగాలని, సీబీఐ విచారణకు ఇవ్వాలో లేదో సీఎం నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రజలంతా ఆయన వెనుకే ఉంటారని అభిప్రాయపడ్డారు. నెయ్యి తక్కువ ధరకు ఇస్తారని చెప్పిన మధ్యవర్తి ఎవరో తేలాలని పవన్ అన్నారు.‘‘స్వామి వారి పూజా విధానాలను మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో టిక్కెట్లు అమ్ముకున్నారు. వైసీపీ పాలనలో 300 ఆలయాలను అపవిత్రం చేశారు. ఏ మతమైనా కావచ్చు. ఏ ప్రార్థనా మందిరం కావచ్చు. మనోభావాలు దెబ్బతినకూడదు. ప్రసాదాలు కల్తీ జరుగుతోంది, నాణ్యత లేదని ముందు నుంచి చెబుతున్నాం. టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నాం. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని అనుకోలేదు. దారుణం ఏంటంటే అయోధ్యకి లక్ష లడ్డూలు పంపించారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్నామని వైసీపీ అంటుంది. రామతీర్థం దేవుడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే రోడ్డు మీదకు వచ్చేవాడిని. ఆరోజు రాజకీయం చేయలేదు’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.