సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేపై నమోదైన లైంగిక వేధింపుల కేసుపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఈరోజు (బుధవారం) కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఇటీవల ఆదిమూలంపై తిరుపతి పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న ఆదిమూలంపై బలాత్కారం... బెదిరించి రేప్ చేయడంపై కేసు నమోదు అయ్యింది. సెప్టెంబర్ 5న రాత్రి 11:15 గంటలకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే ఈస్ట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. సంఘటన జరిగిన బీమాస్ పారడైజ్ హోటల్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో ఆ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అయితే... తనను ఎమ్మెల్యే ఆదిమూలం పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేసి, అత్యాచారానికి పాల్పడ్డారని అందుకు సంబంధించిన వీడియో టేపులను మీడియాకు విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన కేవీబీపురం మండలానికి చెందిన బాధిత మహిళ చివరకు ఆయనతో రాజీ పడినట్లు సమాచారం.
తనను ఎమ్మెల్యే ఆదిమూలం లైంగికంగా వేధించాడని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన ఆమె శుక్రవారం (సెప్టెంబర్ 20) హైకోర్టుకు హాజరై ఎమ్మెల్యేపై తాను పెట్టిన కేసు, అందులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తవమని నివేదించడం గమనార్హం. తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం గత శుక్రవారం విచారణ చేపట్టింది. ఆదిమూలం తరపున సీనియర్ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు. ఆదిమూలంపై పోలీసులు పెట్టిన కేసులో సెక్షన్లు వర్తించవని, మహిళా పోలీసు అధికారిణి నమోదు చేయాల్సిన కేసును పురుష పోలీసు అధికారి నమోదు చేశారని, జూలై, ఆగస్టు నెలల్లో సంఘటన జరిగితే సెప్టెంబరు 5న కేసు నమోదు చేశారని ఆయన కోర్టుకు వివరించారు. ఇదిలా ఉండగా మూడవ వ్యక్తి ప్రమేయంతోనే మహిళ కేసు పెట్టిందని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసును కొట్టి వేయాలని కోరారు. మరోవైపు బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అంశాలన్నీ అవాస్తవమని, ఈ మేరకు నోటరీతో కూడిన అఫిడవిట్‌ను బాధిత మహిళ కోర్టుకు సమర్పించిందని, అందువల్ల ఈ కేసును కొట్టి వేయాలని మహిళ తరఫు న్యాయవాది జితేందర్ సైతం కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృష్ణసాగర్ తీర్పును నేటికి తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు ఆదిమూలంపై కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.