ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత ప్రభుత్వ హయాంలో సమస్యలతో తల్లడిల్లిపోయారు. కొన్ని చోట్ల తాగేందుకు మంచినీరు లేని పరిస్థితి నెలకొంది. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. ఆ సమయంలో నీళ్లు లేవు సామి.. నీకు పుణ్యముంటాది అనే స్థానికుల మాట జనసేనానిని కదిలించింది. ఆ మాటలతో చలించిపోయిన పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఉన్న మిగతా సమస్యలపై దృష్టిసారించారు. కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టాలని కోరారు. అలా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే ప్రధాన సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు. ‘రాష్ట్రంలో పర్యటించే సమయంలో కొందరు నీళ్లు లేవని గుర్తుచేశారు. ఆ మాటలు నన్ను భావోద్వేగానికి గురిచేశాయి. ఆ మాట విని చాలా బాధ పడ్డాను. ప్రజల ప్రాథమిక అవసరాలు కూడా తీర్చడం లేదని మదనపడ్డా. ఆ సమయంలో డిసైడ్ అయ్యా. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించా. ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారు. జనం కస్టాలను తీర్చేందుకు చక్కని అవకాశం కలిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శనంలో పనిచేసే అవకాశం లభించింది. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా పనిచేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతుంది. 100 రోజుల్లో ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రాధాన్యం ఇచ్చాం అని’ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.