నామినేటెడ్ పదవుల కోసం కళ్ళు కాయలు కాచేలా చాన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న వారిలో కొందరికి మంగళవారం అదృష్టం లభించింది. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు చెందిన పలువురికి పదవులు లభించాయి. తొలిదశలో మాజీ మంత్రి పీతల సుజాతను ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ కౌన్సిల్ చైర్మన్ గాను, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజును ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్(ఏపీఐఐసీ) చైర్మన్ గాను, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్‌ను ఏపీ ట్రైకార్ చైర్మన్ గాను నియమించారు.
కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లికి చెందిన కొడాలి వినోద్‌కుమార్‌కు ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి వరించింది. నామినేటెడ్ పదవుల భర్తీకి నెలన్నర క్రితమే ప్రభుత్వపరంగా కసరత్తు ఆరంభమైంది. గడిచిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి సీట్ల కేటాయింపులో ఎందరో త్యాగాలకోర్చారు. పార్టీ ఆదేశాలకు తలొగ్గారు. ఐదేళ్లపాటు కష్టపడి ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడికి గురైన వారెందరో. అందరికీ తగు విధంగా గుర్తించి గౌరవిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో మంగళవారం తొలి నామినేటెడ్ జాబితాను విడుదల చేశారు.