ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని వేసిన పిల్ విచారణ సమయంలో డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎ్‌సజీ), రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అందుబాటులో లేకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. సున్నితమైన అంశంలో ఇంత నిర్లిప్తంగా ఉంటే ఎలా? అని ప్రశ్నించింది. ప్రత్యేక హోదా కోరుతూ సుప్రీంకోర్టు, హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాల స్థితి గురించి ఆరా తీసింది. వివరాలు తెలుసుకొని కోర్టుకు నివేదించాలని న్యాయవాదులకు సూచించింది. ప్రస్తుత పిల్‌తో పాటు ఇదే వ్యవహారంపై దాఖలైన వ్యా జ్యాలను ఏ బెంచ్ విచారించాలనే అంశంపై నిర్ణయం తీసుకొనేందుకు వీలుగా వీటన్నింటినీ సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను దసరా సెలవుల తరువాతకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ మండవ కిరణ్మయితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవానికి ఆర్థిక సహాయం, ఇతర అవసరమైన సహకారం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముం దుకు వచ్చేవారికి పన్ను మినహాయింపులు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిల్ మంగళవారం మరోసారి విచారణకు రాగా పార్టీ ఇన్ పర్సన్ కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ... రాష్ట్ర పునర్విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ వేదికగా హామీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ప్రత్యేక హోదా ప్రకటించడం వల్ల పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇప్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారన్నారు. ఏపీ విషయంలో మాత్రం వెనకాడుతున్నారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ పార్లమెంట్, అసెంబ్లీ వేదికగా చేసే ప్రకటనలపై న్యాయ సమీక్ష జరపడం సాధ్యపడదని వ్యాఖ్యానించింది. అభ్యంతరం ఉంటే పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీలకు ఫిర్యాదు చేయాలని సూచించింది. న్యాయస్థానాలు ఆర్థిక విధానాలు రూపకల్పనకు ఆదేశాలు ఇవ్వగలవా అనే విషయంపై అధ్యయనం చేసి వాదనలు వినిపించాలని పాల్‌కు స్పష్టం చేసింది.