ఒంగోలు ఎంపీ మాగుంట కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యురాలు, దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పార్వతమ్మ చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇటీవల కుమారుడు విజయబాబు మృతితో పార్వతమ్మ మరింత కృంగిపోయారు. ఆమె ఆరోగ్యం మరింత దెబ్బతిన్నది. కొంతకాలంగా పార్వతమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పార్వతమ్మకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందజేశారు.
అయితే పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం పార్వతమ్మ కన్నుమూశారు. పార్వతమ్మ మృతిపట్ల రాజకీయ నేతలు సంతాపం తెలియజేశారు. ఈరోజు మధ్యాహ్నం పార్వతమ్మ భౌతికకాయాన్ని నెల్లూరులోని స్వగృహానికి తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం రేపు(గురువారం) వరకు స్వగృహంలోనే ఉంచనున్నారు. రేపు సాయంత్రం పార్వతమ్మ అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు. మాగుంట సుబ్బరామరెడ్డి దివంగతులైన తరువాత 1996లో తొలిసారిగా పార్వతమ్మ రాజకీయ రంగప్రవేశం చేసి లోక్‌సభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఐఎన్‌సీ తరపున ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. ఆ తరువాత 2004లో ఆమె కావలి నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా ఎంపికయ్యారు. ఒంగోలు ఎంపీ, కావలి ఎమ్మెల్యేగా ప్రజలకు పార్వతమ్మ నిస్వార్ధ సేవలు అందించారు. ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి పార్వతమ్మ వదిన.