వైసీపీ హయాంలో వందల ఆలయాలను ధ్వంసం చేశారని, దేవతల విగ్రహాలను అపవిత్రం చేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రామతీర్థంలో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేస్తే సంయమనం పాటించామన్నారు. ‘‘భారతదేశంలో సెక్యులరిజం వన్ వే కాదు..రెండువైపుల నుంచీ ఉండాలి. ఇతర మతాల ఆచారాలకు, సంప్రదాయాలకు విఘాతం కలిగితే ఎలా స్పందిస్తున్నారో.. హిందువుల మనోభావాలకు, ఆచారాలకు, సంప్రదాయాలకు, ధర్మాలకు విఘాతం కలిగితే అంతే స్థాయిలో స్పందించాలి. దేశంలో అన్ని మతాలకు సమాన హక్కులు ఉన్నాయి. తిరుమల ఘటన వంటిది ఏ మసీదులోనో, చర్చిలోనో జరిగితే వైసీపీ నాయకులు ఇలానే మాట్లాడతారా?’’ అని ప్రశ్నించారు.