‘రానున్న 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని నదులు, వాగుల్లో ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వంతెనలపై నీరు ప్రవహించే చోట్ల ప్రజల రాకపోకలు నియంత్రించాలని ఆదేశించారు. తీరప్రాంత మండలాల్లో మత్స్యకారులు.. సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
శ్రీకాకుళంలో కంట్రోల్ రూమ్ నెంబర్ (08942-240557)కు ప్రజలు అత్యవసర సమయంలో ఫోన్ చేయాలని, సిబ్బంది వెంటనే అప్రమత్తమై తగు సహాయం చేస్తారని తెలిపారు. గండ్లు పడే అవకాశం ఉన్న చెరువులు, కరకట్టలు, కాలువలపై నిఘా ఉంచి ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో ప్రభుత్వాధికారులకు సెలవులను రద్దు చేశామని, అధికారులంతా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.