వచ్చే ఏడాది జూన్ నాటికి మూలపేట పోర్టులో తొలి ఓడ ల్యాండింగ్ అయ్యేలా లక్ష్యం నిర్ణయించామని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం మూలపేటలో నిర్వాసితులతో ఆయన సమావేశమాయ్యరు. ‘వచ్చే ఏడాది జూన్ నాటికి షిప్‌లు ఆగేలా యుద్ధప్రాతిపదికన పోర్టు పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు, కలెక్టర్‌కు ఆదేశించారు. అందుకు అనుగుణంగా నిర్వాసితుల సమస్యల పరిష్కరించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. పోర్టు ఏర్పాటుకు మూలపేట, విష్ణుచక్రం గ్రామస్థులు 365 ఎకరాల భూమి ఇచ్చారు. ఈ ప్రాంతంలో 2,326 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం ఉప్పు భూములు ఉన్నాయి. వీటిని తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించగా.. అంగీకరించింది.
మూలపేట పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 8 లేన్ల రహదారి వేసేందుకు సీఎం చంద్రబాబు సముఖంగా ఉన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతానికి పరిశ్రమలతోపాటు టూరిజం అభివృద్ది చెంది వలస నివారించవచ్చు. గతంలో కాకరపల్లి తంపరలో నిర్మించతలపెట్టిన థర్మల్ పవరప్లాంట్ నిలిచిపోయిందని సంబంధిత యజమానులు బ్యాంక్‌లకు డబ్బులు చెల్లించలేదు. దీంతో వేలంలో వేరేవారికి ఆ భూములు వెళ్లాయి. వారితో మాట్లాడి ఆ భూములు కూడా వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చొరవతో మూలపేటలో ఎయిర్‌పోర్టు మంజూరయ్యేలా కృషి చేస్తున్నామ’ని మంత్రి అచ్చెన్న తెలిపారు.