పీఎంఏవైలో గతప్రభుత్వం మంజూరు చేసిన పేదల ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా తప్పనిసరిగా పూర్తిచేయాల్సిందేనని, ఆ తర్వాత నిర్మాణాలు చేపట్టే గృహాలకు నిధులు వచ్చే అవకాశం లేదని, మండల ప్రత్యేకాధికారి, డీఈవో తాహెరా సుల్తానా స్పష్టంచేశారు. ఉంగుటూరు మండలంలోని పేదల లే అవుట్లలో చేపట్టిన గృహనిర్మాణాల పురోగతిపై గురువారం స్త్రీశక్తి భవనం సమావేశపుహాలులో ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. లే అవుట్లలో అసంపూర్తిగా ఉన్న గృహనిర్మాణాలపై గ్రామాలవారీగా ఆమె సమీక్షించారు.
పేదల సొంత ఇంటి కలనెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం మన ఇల్లు, మన గౌరవం పేరుతో ఈనెల 28నుంచి మండలవ్యాప్తంగా ప్రతి లేఅవుట్‌లో అవగాహనా సదస్సులు నిర్వహించి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించిందన్నారు. పెండింగ్‌లో ఉన్న గృహనిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. తహసీల్దార్ విమలకుమారి, హౌసింగ్ ఏఈ ఎం.సురేష్, సూపరింటెండెంట్ ఎన్.బసవయ్య, ఎంఈవో-2 ఎం.సాం బశివరావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.