వైయస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనకు ఎలాగైనా అవాంతరాలు కలిగించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అధికారం చేతుల్లో ఉంది కదా అని అడ్డగోలు ఆంక్షలతో ఆధ్యాత్మిక నగరాన్ని పోలీసుల వలయంగా మార్చేసింది. మరోవైపు నోటీసులు, హౌజ్ అరెస్టులతో వైయస్ఆర సీపీ నేతలనూ వేధింపులకు గురి చేస్తోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సంచలన ఆరోపణలు.. తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని జగన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చేసిన ఈ పాపానికి పరిహారంగా ప్రక్షాళన పూజలు చేయాలని వైయస్ఆర్ సీపీ కేడర్‌కు ఆయన పిలుపు ఇచ్చారు.
ఈ నేపథ్యంతోనే ఆయన శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే..జగన్ ఇవాళ సాయంత్రమే తిరుమలకు వెళ్లనున్నారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నాం తాడేపల్లికి తిరుగు పయనం అయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పర్యటన కావడం.. పైగా ఈ పర్యటనను ప్రత్యర్థి పార్టీలు రాద్ధాంతం చేసే అవకాశం ఉండడంతో ఎటువంటి హడావిడి చేయొద్దని, ప్రత్యర్థులు కవ్వింపులకు పాల్పడ్డా సంయమనం పాటించాలని పార్టీ కేడర్‌కు ఇప్పటికే ఆయన సూచించారు. అయినప్పటికీ.. కూటమి ప్రభుత్వం అతి చేష్టలకు దిగింది. మునుపెన్నడూ లేని విధంగా తిరుపతి తిరుమలలో పోలీసు మోహరింపు కనిపిస్తోంది. సుమారు వెయ్యి మంది పోలీసులతో జిల్లా వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. ఉన్నపళంగా పోలీస్ యాక్ట్ 30ను తెరపైకి తెచ్చారు. ఈ వంకతో గత రాత్రి నుంచి వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు.