ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో వివాదంలోకి కంగనా రనౌత్.. మోదీ సర్కార్ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించిన బీజేపీ ఎంపీ

national |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 09:25 PM

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుని బీజేపీలో చేరిన కంగనా రనౌత్.. రాజకీయాల్లోనూ అదే దూకుడును ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని, అందులోనూ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ.. కంగనా రనౌత్ చేసే వ్యాఖ్యలు ఆమెను నిత్యం వార్తల్లో, వివాదాల్లో ఉండేలా చేస్తున్నాయి. అదే సమయంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు.. సొంత పార్టీ బీజేపీకే తలనొప్పులు తీసుకువచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా తన వ్యవహార శైలితో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఇప్పుడు.. మోదీ సర్కార్‌కే తలనొప్పిగా మారారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రాజెక్టును వ్యతిరేకిస్తుండటం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది.


హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్టును వ్యతిరేకించడం తీవ్ర చర్చకు దారి తీసింది. 6 నెలల క్రితం.. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని ఖరహల్ వ్యాలీలో బిజిలీ మహాదేవ్ రోప్‌వే ప్రాజెక్టును కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆ బిజిలీ మహాదేవ్ రోప్‌వే ప్రాజెక్టును కంగనా రనౌత్ వ్యతిరేకిస్తున్నారు. రూ.272 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించడంతో ఆమె మరోసారి వివాదానికి తెరతీసినట్లయింది.


అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ బిజిలీ మహాదేవ్ రోప్‌వేకు వ్యతిరేకంగా స్థానికులు గత కొన్ని రోజులుగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోప్‌వే నిర్మాణం వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఈ రోప్‌వే నిర్మాణం కోసం అక్కడ అనేక చెట్లను నరికివేయాల్సి వస్తుందని.. దానివల్ల పర్యావరణం కూడా దెబ్బతింటుందని వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై తమ సమస్యలను స్థానిక ఎంపీ అయిన కంగనా రనౌత్ దృష్టికి తీసుకురావడంతో తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని వారికి ఆమె హామీ ఇచ్చారు.


ఈ క్రమంలోనే ఈ బిజిలీ మహాదేవ్ రోప్‌వే ప్రాజెక్ట్ విషయంలో తాను ఇప్పటికే ఒకసారి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసినట్లు కంగనా రనౌత్ తెలిపారు. స్థానికుల సమస్యలను వివరించినట్లు వెల్లడించారు. ఇక ఈ ప్రాజెక్టును నిలిపివేసేందుకు మరోసారి తాను నితిన్ గడ్కరీని కలవనున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తమకు ఆధునికీకరణ కంటే తమ దేవుడి సంకల్పమే ప్రధానమైందని కంగనా రనౌత్ స్పష్టం చేశారు.


హిమాచల్‌ ప్రదేశ్‌ కులు జిల్లాలోని మోహల్ నేచర్ పార్క్ వద్ద బిజిలీ మహాదేవ్ రోప్‌వేకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కొన్ని నెలల క్రితం శంకుస్థాపన చేశారు. ఈ రోప్‌వేను ఏడాదిన్నరలోగా నిర్మించి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. అయితే ఈ రోప్‌వే నిర్మాణం పూర్తయితే ఒకేరోజులో 36 వేల మంది పర్యాటకులు బిజిలీ మహాదేవ్‌కు చేరుకుంటారని.. దాంతో స్థానికంగా పర్యాటకానికి ఎంతో ఉపయోగపడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.


ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న రోడ్డు మార్గంలో బిజిలీ మహాదేవ్ ఆలయానికి చేరుకోవడానికి పర్యాటకులు 2 నుంచి 3 గంటల పాటు ప్రయాణించాల్సి వస్తోందని.. కానీ ఈ రోప్‌వే అందుబాటులోకి వస్తే.. కేవలం 7 నిమిషాల్లోనే బిజిలీ మహాదేవ్‌ను చేరుకోగలుగుతారని పేర్కొన్నారు. ఇది మోనో కేబుల్‌ రోప్‌వేగా ఉంటుందని.. అందులో 55 బాక్సులను ఏర్పాటు చేస్తామని రోప్‌వే నిర్మాణ పనులను నిర్వహిస్తున్న నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ కంపెనీ వెల్లడించింది. ఈ రోప్‌వే గంటలో 1200 మందిని తీసుకువెళ్లే సామర్థ్యం ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత దాన్ని 1800 మందికి పెంచుతామని ఆ కంపెనీ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com