ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందే భారత్ ట్రైన్లకు భారీగా డిమాండ్.. భారత రైళ్లను కొనేందుకు ఎగబడుతున్న విదేశాలు

national |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 10:41 PM

2019లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు.. భారతీయ రైల్వేల చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరతీశాయి. ఈ క్రమంలోనే వరుసగా మరిన్ని వందే భారత్ రైళ్లు పట్టాలు ఎక్కుతున్నాయి. వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత అదే స్ఫూర్తితో వందే భారత్ మెట్రో రైళ్లు అందుబాటులోకి రాగా.. మరికొన్ని రోజుల్లోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా పరుగులు పెట్టనున్నాయి. అయితే రైలు ప్రయాణికుల నుంచి.. ఈ వందే భారత్ రైళ్ల పట్ల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ చర్యలు ముమ్మరం చేసింది. అయితే అదే సమయంలో విదేశాల్లో కూడా ఈ వందే భారత్ రైళ్లకు మంచి గిరాకీ ఉంది. పలు దేశాలు తమకు కూడా ఈ వందే భారత్ రైళ్లను తయారు చేసి ఎగుమతి చేయాలని కోరుతున్నాయి.


భారత్‌లో స్వదేశీ టెక్నాలజీతో తయారైన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు తమకు కూడా ఎగుమతి చేయాలని.. చిలీ, కెనడా, మలేసియా సహా పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. వందే భారత్‌ రైళ్లను కొనుగోలు చేసేందుకు ఆయా దేశాలు ఆసక్తి చూపిస్తుండటంతో విదేశాల్లో ఈ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. అయితే వందే భారత్ రైళ్లను తయారు చేసేందుకు అయ్యే ఖర్చు తక్కువ కావడంతోనే ఇతర దేశాలు.. వీటిపై బాగా ఇష్టం చూపిస్తున్నాయి. ఇలాంటి అన్ని సౌకర్యాలు ఉన్న అత్యాధునిక రైళ్లను తయారు చేయడానికి విదేశాల్లో రూ.160 కోట్ల నుంచి రూ.180 కోట్ల మధ్య ఖర్చు అవుతోంది. అయితే భారత్‌లో తయారు చేస్తున్న ఈ వందే భారత్ రైలు తయారీకి మాత్రం కేవలం రూ.120 కోట్ల నుంచి రూ.130 కోట్లు సరిపోతున్నాయి. అంటే ఒక్కో రైలుపై కనీసం రూ.40 కోట్లు ఆదా అవుతోంది. దీంతో ఇతర దేశాలు ఈ వందే భారత్ రైలును కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.


ఇక ఈ వందే భారత్ రైళ్లు అధిక వేగాన్ని అందుకోవడానికి అతి తక్కువ సమయం తీసుకుంటుండం కూడా వీటి డిమాండ్ పెరగడానికి కారణం అవుతోంది. జపాన్‌లోని బుల్లెట్ రైలు కంటే.. వందే భారత్ రైళ్లు వేగాన్ని అందుకునేందుకు తక్కువ సమయం తీసుకోవడం గమనార్హం. జపాన్ బుల్లెట్ రైలు.. గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 54 సెకన్ల సమయం తీసుకుంటే.. అదే వందే భారత్ రైలు మాత్రం కేవలం 52 సెకన్లలోనే ఆ వేగాన్ని అందుకుంటుంది. అంతేకాకుండా వందే భారత్‌ రైళ్లను మరింత మెరుగ్గా రూపొందించారని.. అత్యాధునిక సౌకర్యాలు, వేగంతో తయారు చేశారని.. విదేశాలకు చెందిన వారు ప్రత్యక్షంగా చూసి చెబుతున్నారు. దీంతో వీటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.


అంతేకాకుండా ఈ వందే భారత్ రైళ్లు విమానం కంటే 100 రెట్లు తక్కువ శబ్దాన్ని విడుదల చేస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో ఈ వందే భారత్ రైళ్లు నడిచేందుకు ఉపయోదించే ఇంధనం కూడా చాలా తక్కువగానే ఉంటుందని పేర్కొన్నాయి. ఇలాంటి ఫీచర్లు ఉండటంతోనే అనేక దేశాలు వందే భారత్ రైళ్ల పట్ల ఆకర్షితులవుతున్నాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి వస్తున్న ఆర్డర్లు, అదే సమయంలో అంతర్జాతీయంగా రైళ్ల తయారీకి ఉన్న పోటీని తట్టుకునేందుకు వీలైనంత వేగంగా ఈ వందే భారత్ రైళ్ల తయారీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.


అదే సమయంలో మన దేశంలో కూడా మరిన్ని మార్గాల్లో వీలైనంత తొందరగా.. ఈ వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గత 10 ఏళ్లలో 31 వేల కిలోమీటర్లకు పైగా కొత్తగా పట్టాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీన్ని 40 వేల కిలోమీటర్ల వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com