కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు షాక్ తగిలింది. ఆమెపై కేసు నమోదైంది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఓ వ్యక్తి కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసేందుకు పోలీసులు అందుకు నిరాకరించారు. దీంతో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా.. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కొంతమంది బిజినెస్‌మెన్‌లను బెదిరించి.. బీజేపీకి విరాళాలు అందించేలా చేశారని చేసిన ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. కేంద్రమంత్రి పదవికి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని.. కర్ణాటక రాజదాని బెంగళూరులోని తిలక్‌నగర పోలీసులను చట్టసభ ప్రతినిధుల కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో.. నిర్మలా సీతారమన్.. పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించారని.. బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని జనాధికార సంఘర్ష పరిషత్‌కు చెందిన ఆదర్శ్ అయ్యర్ అనే వ్యక్తి.. ఫిర్యాదు చేసేందుకు కొన్ని రోజుల క్రితం తిలక్‌నగర పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
అయితే నిర్మలా సీతారామన్‌పై కేసు పెట్టేందుకు తిలక్‌నగర పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడంతో ఆదర్శ్ అయ్యర్ నేరుగా చట్టసభ ప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జడ్జి సంతోశ్ గజానన హెగ్డే.. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణను అక్టోబరు 10వ తేదీకి వాయిదా వేశారు.
ఇక ఈ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. బిజినెస్‌మెన్‌లను బెదిరించి బీజేపీకి ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు తెప్పించేందుకు ప్రయత్నాలు చేసిన నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రి పదవిలో ఉండడానికి వీలు లేదని పేర్కొన్నారు. ఆమె వెంటనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని కర్ణాటక సీఎం డిమాండ్ చేశారు.