మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజధాని ముంబైలో ఉగ్రదాడులు జరగవచ్చని కేంద్ర నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముంబై వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి.. ప్రార్థనా మందిరాలు, జనంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అనుమానాస్పద కదలికలు గానీ, వ్యక్తులు గానీ కనిపించినా.. ఫిర్యాదు చేయాలని మంబై నగరవాసులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముంబైలోని ప్రముఖ పర్యాటక, ముఖ్యమైన ప్రాంతాల్లో భారీగా పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
ముంబైలోని తమ తమ జోన్లలో అన్ని రకాల భద్రతా చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని.. ఆయా జోన్ల డీసీపీలకు.. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అనుమానాస్పద చర్యలు గుర్తించినా వెంటనే సమాచారం అందించాలని స్పష్టం చేశారు. దేవాలయాలు, మసీద్‌లు, చర్చిల వద్ద సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. నగరానికి ఉగ్రముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముంబై వాసులను పోలీసులు అప్రమత్తం చేశారు. ముంబైలో ప్రతీ ఏడాది దుర్గాపూజ, దీపావళి పండగలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే భారీగా జనం రద్దీ ఉంటుంది. పండగలు, ఎన్నికల సమయంలో ఇలాంటి ఉగ్రముప్పుకు సంబంధించిన హెచ్చరికలు ముంబైకి రావడం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్న క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో ముంబై పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు.
మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే అప్రమత్తం అయిన రాజకీయ పార్టీలు.. కూటములు, ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నాయి. 288 మంది అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముంబైకి ఉగ్రముప్పు హెచ్చరికలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైకి ఉగ్రముప్పు హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం కూడా అలర్ట్ అయింది.