మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో గేట్ నంబర్ 4 గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అక్కడే ఉన్న భక్తులు, చిరువ్యాపారులు ఆ గోడ శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో ఇప్పటివరకు ఇద్దరు చనిపోగా.. చాలా మందికి గాయాలు అయ్యాయి.
సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని ఉజ్జయిని జిల్లా ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఉజ్జయినిలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలోని జ్యోతిషాచార్య పండిత ఆనంద్ శంకర్ వ్యాస్ ఇంటి సమీపంలో ఉన్న పాత ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ ప్రహరీ గోడ పక్కన విక్రయాలు చేసే వీధి వ్యాపారులు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు అదే శిథిలాల కింద సమాధి అయినట్లు ఆలయ నిర్వాహకులకు సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆలయ అధికారులు పోలీసులు, రెస్క్యూ అధికారులకు సమాచారం అందించగా.. వారు వచ్చి చర్యలు మొదలుపెట్టారు.
మహాకాళేశ్వర పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆలయ సిబ్బంది, స్థానికుల సహాయంతో శిథిలాల కింది నుంచి గాయపడిన వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఆ శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ ధృవీకరించారు. అయితే భారీ వర్షం కురుస్తుండగా.. తాము గేట్ నంబర్ 4 వద్ద గొడుగు పట్టుకుని నిలబడి ఉన్నట్లు ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అదే సమయంలో అకస్మాత్తుగా గోడ కూలిందని.. అందులో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి శిథిలాల కింద సమాధి అయినట్లు చెప్పారు.