విజయదశమి వచ్చిందంటే చాలు.. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం కిటకిటలాడిపోతుంది. దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గ గుడికి భక్తులు పోటెత్తుతారు. అమ్మవారి రూపాలను చూసి తరిస్తుంటారు. ఇక ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కోసం అధికారులు కూడా విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. దసరా శరన్నవరాత్రి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆనం రామనారాయణ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు.
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల కోసం 13 శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాల కోసం సీఎం చంద్రబాబును సైతం ఆహ్వానించినున్నట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే సామాన్య ప్రజలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. పార్కింగ్ వద్ద నుంచి క్యూలైన్ల వరకూ భక్తుల కోసం తాగునీటి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
నవరాత్రుల సందర్భంగా దుర్గ గుడికి వచ్చే వీవీఐపీలకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకూ దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆనం వెల్లడించారు. అయితే వీవీఐపీల దర్శనం కోసం ఇతర క్యూలైన్లను ఆపమని స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకూ దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు, అయితే అంతరాలయం వరకూ కాకుండా బంగారు వాకిలి వరకే దర్శనం కల్పిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు.
దసరా నవరాత్రుల సందర్భంగా భక్తుల భద్రత కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. 120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని.. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వీటిని పర్యవేక్షిస్తామని తెలిపారు. భక్తుల కోసం వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రసాదాల విషయంలోనూ అత్యంత అప్రమత్తతతో ఉంటామన్న ఆనం రామనారాయణరెడ్డి.. ఏ చిన్న పొరబాటు జరిగినా అధికారులు బాధ్యత వహించాల్సిందేనని హెచ్చరించారు. ఇక మూల నక్షత్రం రోజున చంద్రబాబు కుటుంబసమేతంగా దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.