ఏపీలో ప్రస్తుతం తిరుమల లడ్డూ వివాదం హాట్ టాపిక్‌గా ఉంది. అయితే దీనికి సమాంతరంగా రాజకీయ వర్గాల్లో మరో చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరూ అదృష్టవంతులూ ఎవరనేదే ప్రధానంగా రాజకీయ చర్చ నడుస్తోంది. వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఈ చర్చ మొదలైంది. ఎందుకంటే కృష్ణయ్య రాజీనామాతో కలిపి వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు సైతం తమ రాజ్యసభ సభ్యత్వాలకు రిజైన్ చేశారు. వారు ఏ కారణంతో రాజీనామా చేసినప్పటికీ ఈ మూడు పదవులు కూడా ఎన్డీఏ కూటమికి దక్కనున్నాయి. దీంతో టీడీపీ కూటమి నుంచి ఎవరిని పెద్దల సభకు పంపిస్తారనే చర్చ నడుస్తోంది.
అయితే నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కూటమి పార్టీలు పక్కా లెక్కల ప్రకారం ముందుకు వెళ్తున్నాయి. టీడీపీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, బీజేపీకి 10 శాతం అనే కాన్సెప్ట్ ఆధారంగా ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూడు రాజ్యసభ ఎంపీ పదవులను సైతం కూటమి పార్టీలు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీడీపీకి రెండు ఎంపీ పదవులు, జనసేనకు ఒక సీటు వెళ్తుందనే ప్రచారం నడుస్తోంది. అయితే తమకూ ఓ సీటు కావాలని కమలనాథులు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ సంగతి పక్కనబెడితే జనసేన నుంచి ఒకరి పేరు, టీడీపీ నుంచి మూడు నాలుగు పేర్లు రాజ్యసభ రేసులో బలంగా వినిపిస్తున్నాయి.
జనసేన సంగతికి వస్తే జనసేన నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వాస్తవానికి నాగబాబు ప్రత్యక్ష ఎన్నికల బరిలోనే నిలవాలని భావించారు. అనకాపల్లి ఎంపీ సీటు నుంచి బరిలోకి దిగాలని ప్రయత్నించారు. అయితే పొత్తుల కారణంగా నాగబాబుకు అవకాశం దక్కలేదు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం ఆయన కూటమి విజయానికి బలంగా కృషిచేశారు. ఈ నేపథ్యంలోనే జనసేన తరుఫున ఆయనను రాజ్యసభకు పంపుతారనే వార్తలు వస్తున్నాయి.
ఇక తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజ్యసభ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, యనమల రామకృష్ణుడుతో పాటుగా మరికొందరు సీనియర్ నేతల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే వీరిలో ఆ ఇద్దరు అదృష్టవంతులూ ఎవరనేదానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో వీరు ముగ్గురికీ పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభకు పంపి గౌరవించాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకో విషయం ఏమిటంటే వీరిలో నాగబాబు, అశోక్ గజపతిరాజు పేర్లు టీటీడీ ఛైర్మన్ రేసులోనూ వినిపించాయి. ఇప్పటి వరకూ ఆ పోస్టును కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఒక వేళ వీరికి రాజ్యసభకు అవకాశం ఇస్తే టీటీడీ ఛైర్మన్ పదవిపైనా క్లారిటీ వచ్చే వీలుంది. మరి చూడాలి అధినేత చంద్రబాబు మనసులో ఏముందో..!