కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుణ్ని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. శ్రీవారి దర్శనం క్షణకాలమైన సరే.. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తిరుమలకు వస్తుంటారు. ఇక శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కూడా అనేక రకాలైన ఆర్జిత సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవల ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. ఆ ఆర్జిత సేవల్లో భాగంగానే ఉదయాస్తమానసేవ సైతం టీటీడీ అందుబాటులోకి ఉంచింది. అయితే ఈ టికెట్ల జారీ ఇప్పుడు ప్రారంభం కాలేదు. 1980లలోనే తీసుకువచ్చారు. అయితే మధ్యలో వివిధ కారణాలతో నిలిపేశారు. 2021 నుంచి టీటీడీ మరోసారి అందుబాటులోకి తెచ్చింది. పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కోటి రూపాయలకుపైగా విరాళాలు అందించే వ్యక్తులకు, సంస్థలకు ఈ టికెట్లు కేటాయించాలని నిర్ణయించారు.
ఇక ఈ కోటి రూపాయల ఉదయాస్తమానసేవ టికెట్ పొందిన వారు రోజంతా శ్రీవారి సేవలో పాల్గొనవచ్చు. తెల్లవారుజామున మొదలయ్యే సుప్రభాత సేవ దగ్గర నుంచి రాత్రి ఏకాంత సేవ వరకూ.. స్వామి వారికి జరిగే సేవలలో పాల్గొనవచ్చు. అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం, అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలలో పాల్గొనవచ్చు. అయితే ఏడాదిలో ఒకరోజు మాత్రమే టీటీడీ ఈ అవకాశం కల్పిస్తుంది. 25 ఏళ్ల పాటు ఏడాదికి ఓ రోజు ఇలా రోజంతా శ్రీవారి సేవలో పాల్గొనవచ్చు. టికెట్ పొందిన భక్తుడితో పాటుగా ఆరుగురు కుటుంబసభ్యులను సేవలలో పాల్గొనేందుకు అనుమతిస్తారు.
టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు సమర్పించి ఈ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి ఒక టికెట్ మాత్రమే పొందే వీలుంది. అయితే వ్యక్తులే కాదు సంస్థల పేరు మీద కూడా ఈ కోటి రూపాయల ఉదయాస్తమానసేవ టికెట్ పొందే వీలుంది. అయితే సంస్థల పేరున కొనుగోలు చేస్తే.. 20 ఏళ్ల పాటు మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే వ్యక్తుల పేర్ల మీద కొనుగోలు చేస్తే.. కుటుంబసభ్యుల పేర్ల నమోదుకు ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మార్చే వీలుండదు. కానీ సంస్థల తరుఫున కొనుగోలు చేస్తే ఎన్నిసార్లు అయినా పేరు మార్చుకునే వీలు ఉంటుంది. అయితే దర్శనానికి వచ్చిన సమయంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
కోటి రూపాయల ఉదయాస్తమానసేవ టికెట్ పొందిన వారికి స్వామికి అర్పించిన వస్త్రాలు, ప్రసాదాలు సైతం అందజేస్తారు. ఒకవేళ ఏదైనా కారణంతో దర్శనానికి రాలేకపోతే.. కుటుంబసభ్యులను సైతం పంపే వీలుంది. టికెట్ కొనుగోలు చేసిన వారు ఆదాయపు పన్ను సెక్షన్ 80G కింద పన్ను మినహాయింపు సైతం పొందొచ్చు. ప్రత్యేక కాటేజీ ఉచితంగా ఇస్తారు. అయితే ఈ టికెట్లను ఎప్పుడైనా రద్దు చేసే అధికారం టీటీడీకి ఉంది.