కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారంనాడు స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఖర్గే సొమ్మసిల్లిపోయారు. సభా వేదికపై ఆయన పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు ఆయన్ను పట్టుకుని నీళ్లు తాగించారు. ఆ తర్వాత కోలుకున్న ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ప్రధాని మోదీనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తనకు 83 ఏళ్లు అవుతున్నాయని.. అప్పుడే మరణించబోనని అన్నారు. ప్రధాని మోదీని అధికారం నుంచి దించే వరకు తాను మరణించబోనని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.
ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గేను ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం ఫోన్‌లో పరామర్శించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఖర్గే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బీపీ పడిపోవడంతో ఆయన సొమ్మసిల్లినట్లు తెలుస్తోంది.
కాగా జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి మూడో దశ ఎన్నికల ప్రచార పర్వం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. చివరి విడత పోలింగ్ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. చివరి విడతలో మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో జమ్ములో 11 స్థానాలు, కఠువాలో 6 నియోజకవర్గాలు, సాంబాలో 3, ఉదంపూర్ జిల్లాలో 4 స్థానాలు ఉన్నాయి. అలాగే కశ్మీర్ లోయలోని బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోని 16 అసెంబ్లీ స్థానాలకు చివరి విడతలో పోలింగ్ జరగనుంది.