తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ప్రచారంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లడ్డూ కల్తీ జరిగిందన్న ఆధారాల్లేకుండా.. పైగా దర్యాప్తు ఇంకా మొదలుకాకముందే మీడియా ముందుకు వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని? నిలదీసింది. దేవుడ్ని రాజకీయంలోకి లాగొద్దంటూ చురకలంటించింది. ఈ తాజా పరిణామాలపై వైయస్ఆర్‌సీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..... చంద్రబాబు ఇప్పటికైనా శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలి. కోట్లాది మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు. సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు మాటలను తప్పుపట్టింది. చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్‌తో విచారణ చేస్తే వాస్తవాలు వెల్లడి కావు. స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలి.
చంద్రబాబును కూడా ఆ విచారణ సంస్థ ప్రశ్నించాలి. సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలనేది మా డిమాండ్
తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభవాలతో ఆడుకోవద్దని చంద్రబాబు, పవన్ ను కోరుతున్నాను. NDDB రిపోర్ట్ టీడీపీ కార్యాలయంలో విడుదల చేయటంపై విచారణ జరగాలి. సుప్రీం కోర్టు విచారణలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు కూడా కల్తీ జరిగిందనే ఆరోపణలు ఉన్న నెయ్యిని వాడలేదని కోర్టులో చెప్పారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారు. సిట్ వేయాల్సిన అవసరం ఏంటి, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మూడో తారీఖున జరిగే విచారణలో నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నాను. తిరుమల శ్రీవారితో రాజకీయాలు చేయవద్దని చంద్రబాబును కోరుతున్నాను. సుప్రీంకోర్టు విచారణ ద్వారా అనేక అనుమానాలు తొలిగాయని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.