తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా? అంటూ సూటిగా ప్రశ్నించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అందుబాటులో లేకపోవడంతో విచారణ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. లడ్డూ అంశంపై ఏపీ సీఎం, టీటీడీ ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని.. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరారు. లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి పరీక్షకు నిర్దిష్ట విధానాలు ఉన్నాయి. కల్తీ జరిగిన వంద శాతం నెయ్యి వాడలేదని స్వయంగా ఈవో చెప్పారు. ఇష్టారీతిన మాట్లాడడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి. రాజకీయ కుట్రతో లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారు. దేవాలయ వ్యవహారాలు పూర్తిగా ఈవో, బోర్డునే నిర్వహిస్తారు. ఈవో ను ప్రస్తుత ప్రభుత్వమే నియమించింది సుబ్రహ్మణ్యస్వామి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.