పుంగనూరులో ఆరేళ్ల బాలిక అదృశ్యంపై కలకలం రేగింది. ఆదివారం రాత్రి నుంచి పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పుంగనూరు ఉబేదుల్లాకాంపౌండ్‌కు చెందిన అజ్మతుల్లా కుమారై అస్వియా(6) ఆదివారం సాయంత్రం స్నేహితులతో ఇంటి వద్ద ఆడుకుంటుండగా కరెంటు పోయింది. దీంతో అస్వియా తల్లి బయటకు వచ్చి చూడగా కుమార్తె కన్పించలేదు. భర్త అజ్మతుల్లాకు ఆమె ఫోన్ ద్వారా విషయం తెలియజేసింది. బాలిక కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రాత్రి 10.30గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు.
సోమవారం ఎస్పీ మణికంఠ ఆదేశాలతో 11పోలీసు బృందాలను నియమించి గాలింపు చర్యలు చేపట్టారు. రెండు డాగ్‌స్క్వాడ్ బృందాలు కూడా పలువీధుల్లో గాలించారు. సోమవారం సాయంత్రం ఆస్వియా ఇంటికి వెళ్లిన ఎస్పీ మణికంఠ పాప కుటుంబీకులను విచారించారు. క్లూస్ టీం ద్వారా వచ్చిన సమాచారంపై పోలీసులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలిక ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. చిన్నారి తండ్రి ఫైనాన్స్ వ్యాపారి కావడంతో అనుమానితులుగా ఉన్న వారిని విచారిస్తున్నామని చెప్పారు. డీఎస్పీలు ప్రభాకర్, సాయినాథ్ తదితరులు ఆయన వెంట వున్నారు.