హిజ్రాలు బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని ఒంగోలు ఎస్పీ ఏఆర్ .దామోదర్ హెచ్చరించారు. సోమవారం స్థానిక పోలీసు కల్యాణ మండపంలో హిజ్రాలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొందరు హిజ్రాలు బలవంతపు వసూళ్లు, అసాంఘిక కార్యక్రమాల వలన సమాజంలో చిన్న చూపునకు గురవుతున్నారని అన్నారు. కొందరు గ్రూపులుగా విడిపోయి శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని చెప్పారు.
భిక్షాటన మానుకొని ప్రత్యామ్నాయ జీవనం కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని వాటిని వినియోగించుకొని గౌరవంగా బతకాలని కోరారు. ఈ సందర్భంగా హిజ్రాలు ఎస్పీ మాటలకు పరివర్తన చెంది తాము గౌరవంగా బతుకుతామని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఆశోక్ బాబు, డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు,ఎఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు రాఘవేంద్రరావు , శ్రీకాంత్ బాబు ,ఆజయ్ కుమార్ , హజరత్తయ్య, ఆర్‌ఐలు రమణారెడ్డి, సీతారామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.