తిరుమల లడ్డూ ప్రసాదంపై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడిని వివాదాల్లో తీసుకొని రావద్దని ఎంత చెప్పినా సీఎం చంద్రబాబు వినలేదన్నారు. కేసు పెట్టకుండా, విచారణ జరపకుండా సీఎం చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడాడని విమర్శించారు. నాటు సారా తాగినా వ్యక్తి మాట్లాడినట్లు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు అసత్యాలు మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు సరైన విధంగా ప్రశ్నించిందని, దేవుడే సుప్రీం కోర్టుతో మాటలు పలికించారని పేర్కొన్నారు.
నిజం ఎప్పటికైనా గెలుస్తుందని, తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా సీబీఐ విచారణ కోరుతున్నామని చెప్పారు. తిరుమల వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని తగ్గించే విధంగా చంద్రబాబు, పవన్ మాట్లాడారని, వారిని హిందువులు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.