భారత రాజ్యాంగాన్ని మార్చాలని కొందరు మాట్లాడుతున్నారని, అలాంటి వారిని తరిమికొట్టండి అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హర్యానా ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ప్రియాంకా గాంధీ హర్యానాలోని అంబాలలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంకా మాట్లాడుతూ... బీజేపీ, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. భారత రెజర్లు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. న్యాయం కోసం రోడ్డుపై నిరసనలు తెలిపితే కనీసం మోడీ వాళ్లను కలిసేందుకు సమయం కేటాయించలేదని విమర్శించారు.
ఇప్పటి వరకు మోడీ ఒక్కసారి కూడా రెజ్లర్లతో సమావేశం కాలేదన్నారు. రెజ్లర్లను బీజేపీ ప్రభుత్వం రోడ్డున పడేసిందని విమర్శించారు. ఒలింపిక్స్‌లో ఏం జరిగిందో ప్రజలంతా చూశారని, ఆత్మగౌరవం కోసమే రెజ్లర్లు పోరాడుతున్నారని వెల్లడించారు. మరో వైపు పెరుగుతున్న నిత్యావసన ధరలపై ప్రజలు ఆందోళన చేస్తున్నారని, మరి దీని కోసం మోడీ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. హర్యానా ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని సూచించారు. హర్యానాలో అక్టోబరు 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అక్టోబర్ 8న ఫలితాలు విడుదల కానున్నాయి.