నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఏడాదిన్నర క్రితం ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపింది. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఈ మేరకు వెల్లడించారు. ఏపీలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తామని.. ఐదు నెలల్లో వీటిని పూర్తిచేస్తామని వంగలపూడి అనిత తెలిపారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలని అభ్యర్థులకు వంగలపూడి అనిత సూచించారు. అర్ధాంతరంగా ఆగిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పుకొచ్చారు.
మరోవైపు ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది హాజరయ్యారు. వీరిలో 95,209 మంది అభ్యర్థులు తదుపరి దశకు ఎంపికయ్యారు. అయితే ఆలోపే ఎమ్మెల్సీ ఎన్నికలు రావటంతో నియామక ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. మరోవైపు ప్రిలిమినరీ పరీక్షకు 3,622 మంది హాంగార్డులు హాజరయ్యారు. వీరిలో 382 మంది క్వాలిఫై అయ్యారు. అయితే హోంగార్డులను ప్రత్యేక విభాగంగా పరిగణించాలని, హోంగార్డుల కోటాలో ప్రత్యేక మెరిట్ లిస్ట్ విడుదల చేయాలంటూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు కూడా హోంగార్డులను తదుపరి దశకు అనుమతించాలని ఆదేశించింది. ఇక అప్పటి నుంచి కానిస్టేబుల్ నియామక ప్రక్రియ ఆగిపోయింది.
అయితే అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం దీనిపై న్యాయ సలహా తీసుకుని.. కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక, సామర్థ్య పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి వివరాలను సైతం స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. శారీరక, సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించిన వారికి మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. అయితే ఐదు నెలల్లోగా శారీరక, సామర్థ్య పరీక్షలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.