తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై నటుడు సుమన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై రిపోర్టులు సరిగా లేవని.. ఆరోపణలు మాత్రం ఉన్నాయన్నారు. ఒకవేళ లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించినట్లు రిపోర్టులు వచ్చినప్పుడు తాను స్పందిస్తానన్నారు. ఒకవేళ కల్తీ జరిగినట్లు తేలితే.. ఆ సమయంలో ఎవరు అధికారులుగా ఉన్నారు, అప్పుడు ఎవరు పాలకమండలిలో ఉన్నారు, ఎవరెవరు ఇంఛార్జ్‌లుగా ఉన్నారో వారిని అరెస్ట్ చేసి రెండేళ్ల జైల్లో పెట్టాలని వ్యాఖ్యానించారు.
మత విశ్వాసాల విషయంలో ఎవరూ తప్పు చేయకూడదని.. ప్రజలు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని ప్రసాదం తీసుకున్నప్పుడు.. అది కల్తీ అంటే అంతకంటే ద్రోహం ఏముంటుందన్నారు సుమన్. డబ్బులు, మిగతా స్కాంలు జరుగుతాయి అది వేరే విషయమని.. కానీ పరమ పవిత్రంగా భావించే.. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగుంటే అది చాలా తప్పన్నారు. అసలు ఈ లడ్డూలో కల్తీ నెయ్యి విషయంలో క్లారిటీ లేదని.. గత ప్రభుత్వంలో జరిగిందా, ప్రభుత్వం మారినప్పుడు జరిగిందా అనేది ఊహాగానాలుగా ఉందన్నారు.
తిరుమలకు వచ్చిన రెండు నెయ్యి ట్యాంకర్లలో కల్తీ ఉందని తెలిసి వాటిని వెనక్కు పంపించారని అంటున్నారని.. ట్యాంకర్లను వెనక్కు పంపించిన తర్వాత ఏ నెయ్యి వాడారో క్లారిటీ లేదన్నారు సుమన్. అంతకముందు ఏ నెయ్యి వాడారో కూడా తెలియదని.. ఇవన్నీ క్లారిటీ వస్తే.. నిజంగానే కల్తీ జరిగి ఉంటే తిరుమల శ్రీవారి భక్తుల్ని మోసం చేసినట్లే అన్నారు. ఎవరి మతం వారికి గొప్ప.. మతం విషయంలో ఎలాంటి తప్పులు జరగకూడదని.. దీని కోసం ఒక యాక్ట్ తీసుకొస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రెండు రోజుల క్రితం కూడా సుమన్ ఈ అంశంపై స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారని.. దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేయడం మహా పాపమని వ్యాఖ్యానించారు. దేవుడి ప్రసాదాలు ఏర్పాటు చేసేందుకు ఓ కమిటీని నియమించేలా చట్టం తీసుకురావాలని..ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలి అన్నారు. శ్రీవారి పాత్ర పోషించే అదృష్టం తనకు దక్కిందన్నారు సుమన్.