"స్వచ్ఛతా హి సేవ" కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. గత వైసీపీ పాలకులు పట్టణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని సీఎం ఆరోపించారు. నగరంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారం పేరుకుపోయి కనిపిస్తోందని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో 85లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేర్చారని, కానీ దాని ప్రక్షాళనకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తొలగించాలంటే కనీసం రెండు, మూడేళ్లు పడుతుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ పనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అన్ని వ్యవస్థలనూ గాడిలో పెడతామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.."బందర్ పోర్టు పనులను ఆకస్మిక తనిఖీ చేశాం. 3669 పీపీ మోడల్‌లో 2025 అక్టోబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ రూ.885కోట్ల పనులు మాత్రమే జరిగాయి. డెవలపర్‌ని పిలిచి డెడ్ లైన్ పెడతా. పోర్ట్ పనులు పూర్తి చేయకపోతే చర్యలు ఉంటాయి. ప్రాజెక్టుకు ఇంకా 36.30ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్‌కు చెప్పాం. పోర్ట్ ఫైనల్ ప్రాజెక్టుకు 3,696 ఎకరాలు అవసరం. ఇది పూర్తయితే మచిలీపట్నం వేగంగా అభివృద్ధి చెందుతుంది. అమరావతికి దగ్గరగా ఉండే ఓడరేవు ఇది. రాజధానిగా పోర్టుగా దీన్ని అభివృద్ధి చేస్తాం. తద్వారా అన్ని ప్రాంతాలకూ మంచి జరుగుతుంది. ఇసుక కొరత ఉందని చెప్పారు. ఫాస్ట్ ట్రాక్‌లో ఇవ్వాలని చెప్పాం. పరిశ్రమలకు ఇక్కడ అవకాశం ఇస్తే ఎగుమతులు పెరుగుతాయి అని అన్నారు.