తిరుమల లడ్డూ వివాదంపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందించారు. తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్రానికి చెందిన పోలీసు విభాగం నుంచి ఇద్దరు, ఫుడ్ సేప్టీ విభాగం నుంచి ఒకరితో కమిటీ వేసిందన్నారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు బయటకు తీయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. బీజేపీ గతంలో కూడా అనేక సార్లు గత ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగిందని గుర్తుచేశారు.
సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక హిందూ ఆలయాలపై దాడులు జరిగాయన్నారు. రథం తగులపెట్టినా, రాముడి తల తొలగించినా ఒక్కరిని కూడా జగన్ ప్రభుత్వం అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక హిందూ ఆలయాల్లో అపచారాలు చేసే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తిరుమలలో సీఎం అయ్యిండి నిబంధనలను తుంగలో తొక్కారన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలను దంపతులు సమర్పించాలని హిందూ ధర్మం చెబుతుందని.. ఆయన శ్రీమతి అన్యమతాన్ని నమ్ముకున్నందున జగన్ ఒక్కరే పట్టు వస్త్రాలు ఇచ్చారని విమర్శించారు. ‘‘నేను వైఎస్ బిడ్డను.. నా తండ్రి చాలాసార్లు తిరుమల వెళ్లారు, నేను కూడా వెళ్లాను అని జగన్ చెబుతున్నారు. మీ తండ్రి కూడా ఏడు కొండలను రెండు కొండలుగా చేయాలని చూసింది వాస్తవం కాదా’’ అని ప్రశ్నించారు.