తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్థానంలో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులతో పాటు భారత ఆహార భద్రత-ప్రమాణాల అథారిటీ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ)కి చెందిన సీనియర్ అధికారి సభ్యులుగా ఉంటారని, సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది. తమ ఆదేశాలను రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ సభ్యుల విశ్వసనీయతను శంకిస్తున్నట్లుగా భావించరాదని స్పష్టంచేసింది.
వారందరికీ మంచి ప్రతిష్ఠ ఉందని.. వారు దర్యాప్తును కొనసాగిస్తే అభ్యంతరం చెప్పాల్సింది ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పిన విషయాన్ని తన ఆదేశాల్లో ప్రస్తావించింది. అయితే అదే సమయంలో దర్యాప్తును పర్యవేక్షించేందుకు సిట్ అధికారుల కంటే సీనియర్ అయిన ఒక కేంద్ర ప్రభుత్వ అధికారిని నియమించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను సంతృప్తిపరిచేందుకు స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నామని.. ఈ దర్యాప్తు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగడం సముచితమని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. నెయ్యి కల్తీ ఆరోపణలు, ప్రత్యారోపణల్లో వాస్తవాల జోలికి తాము వెళ్లడం లేదని తెలిపింది. సుప్రీంకోర్టును రాజకీయ పోరాటానికి మైదానంగా ఉపయోగించుకోవడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ అంశంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యంస్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సురేశ్ చవహంకే, విక్రమ్ సంపత్ దాఖలు చేసిన పిటిషన్లను పరిష్కరించింది. వాస్తవానికి ఈ పిటిషన్లపై గురువారమే విచారణ జరగాల్సి ఉండగా.. సొలిసిటర్ జనరల్ శుక్రవారం ఉదయం వరకు సమయం కోరారు. ధర్మాసనం అందుకు అంగీకరించి శుక్రవారం మొదటి కేసుగా విచారణ జరిపింది.