ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నం తినిపించి, ఆ తర్వాత హత్య.. పుంగనూరు బాలిక కేసులో దిగ్భ్రాంతికర విషయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 06:08 PM

చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన ఆరేళ్ల చిన్నారి హత్యకేసు మిస్టరీ వీడింది. బాలిక హత్యకు నగదు లావాదేవీలే కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ఆదివారం మీడియాతో వెల్లడించారు. పుంగనూరుకు చెందిన ఆరేళ్ల బాలిక సెప్టెంబర్ 29 నుంచి కనిపించడం లేదు. ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన బాలిక ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. తెలిసిన వారిని విచారించారు. ఎక్కడా ఆచూకీ తెలియకపోవటంతో.. పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు.


బాలిక జాడ కనిపెట్టేందుకు 12 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. డాగ్ స్క్కాడ్‌ను సైతం రంగంలోకి దింపారు. అయితే ఎలాంటి ఫలితం కనిపించలేదు. అయితే మూడు రోజుల తర్వాత పుంగనూరు సమ్మర్ స్టోరేజీలో బాలిక మృతదేహం కనిపించింది. కుటుంబసభ్యులకు సమాచారం అందించిన పోలీసులు.. వారు ధ్రువీకరించడంతో చనిపోయింది తప్పిపోయిన బాలికేనని నిర్ధారించారు. ఎవరో హత్యచేసి సమ్మర్ స్టోరేజీలో పడేశారనే అనుమానంతో దర్యాప్తు కొనసాగించారు. ఈ దర్యాప్తులో అసలు కారకులు వెలుగులోకి వచ్చారు. ఆరేళ్ల బాలిక హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు వెల్లడించారు.


బాలిక తండ్రి స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం నడుపుతున్నారు. ఆయన వద్ద ఓ మహిళ రూ.3.5 లక్షలు అప్పుగా తీసుకుంది. అయితే తీసుకున్న అప్పును వెనక్కి ఇవ్వాలంటూ బాలిక తండ్రి ఇటీవల డిమాండ్ చేస్తున్నారు. ఎంతగా అడిగినా ఇవ్వకపోవటంతో సివిల్ కోర్టులో కేసు వేస్తానని బెదిరించినట్లు తెలిసింది. దీంతో బాలిక తండ్రిపై పగ పెంచుకున్న సదరు మహిళ.. చిన్నారిని బలితీసుకుంది. సెప్టెంబర్ 29న బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో బుర్ఖా ధరించిన మహిళ.. ఆ బాలిక వద్దకు వచ్చింది. ఓ చాక్లెట్ ఇచ్చి ఆశచూపించింది. తమ ఇంటికి వస్తే మరిన్ని చాక్లెట్లు ఇస్తామంటూ బాలికను తన తల్లి ఇంటికి తీసుకెళ్లింది. అక్కడే భోజనం తినిపించింది.


ఆ తర్వాత చిన్నారి తండ్రిపై ఉన్న కోపంతో.. ఆరేళ్ల బాలిక నోరు, ముక్కు అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత మరో బైక్ మీద తీసుకెళ్లి పుంగనూరు సమ్మర్ స్టోరేజీలో పడేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ తెలిపారు. బుర్ఖా వేసుకున్న మహిళ.. చిన్నారిని తీసుకెళ్లినట్లు పక్కనే ఉన్న మరో చిన్నారి చెప్పారని ఎస్పీ వివరించారు. సమీప బంధువైన మైనర్ బాలుడి సాయంతో బాలికను.. ఆ మహిళ తన తల్లి ఇంటికి తీసుకెళ్లిందని తెలిపారు. బాలిక కనిపించకుండా పోయినరోజే హత్య చేశారని.. పాప శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో పాప కడుపులో మొక్కజొన్న గింజలు, అన్నం ఉన్నట్లు గుర్తించామన్న పోలీసులు.. భోజనం తినిపించిన తర్వాత హత్యచేసినట్లు వెల్లడించారు. హత్య తర్వాత మైనర్ బాలుడి సాయంతో మృతదేహాన్ని బైక్ మీద తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజీలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొంతమంది అనుమానితులను కూడా విచారించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు అదుపులో ఉన్నట్లు వెల్లడించారు.


పుంగనూరు బాలిక కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు పరామర్శ


మరోవైపు హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్‌, రాంప్రసాద్‌రెడ్డి పరామర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చిన్నారి తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఆరేళ్ల బాలిక హత్య కేసులో ఐదుగురు అనుమానితులను గుర్తించామన్న హోంమంత్రి వంగలపూడి అనిత.. వారిని అరెస్టు చేసి, చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పారు. అత్యాచారం ఆరోపణలు అవాస్తమని.. అలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com