అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ వరకు మద్యం షాప్‌లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాప్‌లకు లాటరీలు నిర్వహించనున్నట్టు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైందని ఆయన చెప్పారు. దరఖాస్తు రుసుము రెండు లక్షల రూపాయలని ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు. మూడు విధానాల్లో దరఖాస్తుల స్వీకరిస్తామని, జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల మధ్య ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఎంఆర్‌పీ కంటే అధిక రేటు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్మిట్ రూములకు, బెల్ట్ షాపులకు అనుమతి లేదని తెలిపారు. ప్రీమియర్ షాపులకు ఫీజును రూ.1 కోటిగా నిశాంత్ కుమార్ నిర్ధారించారు. మద్యం షాపుల నిర్వహణపై నిరంతరం నిఘా ఉంటుందని, స్కూల్స్, టెంపుల్స్ ఉన్న చోట వంద మీటర్ల పరిధిలో ఎటువంటి మద్యం షాపులకు అనుమతి లేదని క్లారిటీ ఇచ్చారు. మద్యం షాపులు ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న అంశంపై నూతన మద్యం పాలసీలో నిబంధనలను పొందుపరిచామని, బీసీల పేరుతో షాపులు వేరే వ్యక్తి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని నిశాంత్ కుమార్ హెచ్చరించారు.