హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెద్ద హైడ్రామా చోటు చేసుకుంటోంది. మొదట కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యం కనబరిచినట్లు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కనిపించింది. అయితే అప్పటివరకు వెనుకంజలో ఉన్న బీజేపీ.. అనూహ్యంగా పుంజుకుని కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి ముందుకు దూసుకొచ్చింది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటలకు వరకు హరియాణా ఎన్నికల ఫలితాల వెల్లడిలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇక దీని వెనుక ఉన్న కారణాన్ని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది.
ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య ఎన్నికల ట్రెండ్స్ అప్‌డేట్ చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని ఈసీకి రాసిన లేఖలో కాంగ్రెస్ పేర్కొంది. కాలం చెల్లిన, తప్పుదోవ పట్టించే ట్రెండ్స్‌ను షేర్ చేస్తూ ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి పెంచడానికి బీజేపీ తీవ్ర ఒత్తిడి చేస్తోందా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఉద్దేశపూర్వకంగా డేటాను ఆలస్యంగా ఈసీ వెబ్ సైట్‌లో అప్‌డేట్ చేస్తున్నారని లేఖలో హస్తం పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో మాదిరే హరియాణాలోనూ ఓట్ కౌంటింగ్ ట్రెండ్స్‌ని కేంద్ర ఎన్నికల సంఘం.. తమ వెబ్‌సైట్‌లో సరిగా అప్‌డేట్ చేయడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. 12, 13 రౌండ్ల ఓట్లు లెక్కింపు పూర్తి అయినా ఈసీ వెబ్‌సైట్‌లో 4, 5 రౌండ్ల ఫలితాలు మాత్రమే చూపిస్తున్నారని.. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్న నియోజకవర్గాల డేటాను వేగంగా వెల్లడించడం లేదని విమర్శలు చేశారు. తప్పుడు ట్రెండ్స్ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం అధికారులపై బీజేపీ ఒత్తిడి తెస్తోందనే అనుమానం తలెత్తుతోందని పేర్కొన్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఎన్నికల సంఘం కౌంటర్ ఇచ్చింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొత్తం అభ్యర్థుల సమక్షంలోనే జరుగుతోందని పేర్కొంది. కౌంటింగ్ మొత్తం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతోందంటూ కాంగ్రెస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ఇప్పటివరకు ఏ కౌంటింగ్ కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఈ సందర్భంగా ఈసీ వెల్లడించింది.