పలు రంగాల్లో అసాధారణ కృషి చేసిన వారిని గుర్తించి వారికి ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతులు ప్రకటించే ప్రక్రియ నిన్నటితో ప్రారంభం కాగా.. ఇవాళ భౌతిక శాస్త్రంలో ఈ పురస్కారం అందుకున్న వారి పేర్లను ప్రకటించారు. ఫిజిక్స్‌లో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది. జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్‌లకు 2024 నోబెల్ పురస్కారం దక్కింది. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలు చేసిందుకు గానూ జాన్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది.
ఇక గత సంవత్సరం ఫిజిక్స్‌లో ముగ్గురికి ఈ నోబెల్ పురస్కారాన్ని ఇచ్చారు. పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల కదలికలకు సంబంధించి పరిశోధలు చేసిన ఫ్రాన్స్ సైంటిస్ట్ పియర్ అగోస్తి, హంగేరియన్‌కు చెందిన ఫెరెంక్ క్రౌజ్, ఫ్రాన్స్-స్వీడన్ సైంటిస్ట్ యాన్ ఎల్ హ్యులియర్‌లు 2023 ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. సోమవారం వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఇద్దరి పేర్లను ప్రకటించారు. అమెరికాకు చెందిన విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్కింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్ ట్రాన్‌స్ర్కిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్ర కనుగొన్నందుకు వారికి ఈ గౌరవం లభించింది.
మరోవైపు.. సోమవారం ప్రారంభం అయిన ఈ నోబెల్ పురస్కార విజేతల ప్రకటన.. ఈనెల 14వ తేదీ వరకు జరగనుంది. సోమవారం వైద్యశాస్త్రంతో మొదలు కాగా.. ఇవాళ ఫిజిక్స్ విభాగంలో విజేతల పేర్లను వెల్లడించారు. బుధవారం కెమిస్ట్రీ, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14వ తేదీన ఎకనామిక్స్‌లో నోబెల్ బహుమతి సాధించిన వారి పేర్లను వెల్లడిస్తారు. వీరందరికీ డిసెంబర్ 10వ తేదీన నోబెల్ పురస్కారాన్ని అందించనున్నారు. రేపు కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి దక్కించుకున్న వారి పేర్లను వెల్లడించనున్నారు.
స్వీడన్‌కు చెందిన సైంటిస్ట్, ఇంజినీర్, బిజినెస్‌మెన్ ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద.. ప్రపంచంలో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఏటా ఈ నోబెల్ పురస్కారాలను ప్రకటించి ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోగా.. 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు. ఈ నోబెల్ బహుమతి దక్కించుకున్న వారికి 11లక్షల స్వీడిష్ క్రోనర్‌లు అంటే 10 లక్షల డాలర్లు.. (భారత కరెన్సీలో రూ.8.4 కోట్లు) నగదు పురస్కారం దక్కుతుంది.