ఆత్మస్తుతి పరనింద ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న అలవాటు అని మాజీ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. ఈ విషయంలో మనా తనా అనే భేదం కూడా ఉండదన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత నిర్వహించిన మొదటి కలెక్టర్లు ఎస్పీలు, ఉన్నతాధికారుల సమావేశంలో మాది పొలిటికల్ గవర్నెన్స్ మా వారు చెప్పిందే చేయండి అని చెప్పి విచ్చలవిడిగా దందాలకు, అరాచకాలకు ఆజ్యం పోశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి ఆ తప్పులు ఎమ్మెల్యేల మీద నెట్టుతున్నారు.’’ అంటూ ఆర్కే రోజా దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్‌ల తీరుపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తన మీడియాతోనే తమ ఎమ్మెల్యేల మీద బురదజల్లి తప్పంతా వారిదే అన్నట్లు ప్రచారం చేయిస్తున్నారు. ఈ మాటున తన తప్పులు, వైఫల్యాలు, కుమారుడు లోకేష్ దందాలను చర్చకు రానివ్వడం లేదు. ఎమ్మెల్యేల అవినీతిపై ఉదయం కథనాలు, చర్చ చేస్తున్న సదరు మీడియానే సాయంత్రం ముఖ్యమంత్రి వీరుడు, శూరుడు అంటూ ఎంపిక చేసుకున్న వందిమాగాదులతో చిలకపలుకల మాటలతో రక్తికట్టిస్తున్నారు.’’ అంటూ ఆర్కే రోజా ఎండగట్టారు.
‘‘అధికారంలోకి రావడం కోసం మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం. అధికారంలోకి వచ్చిన తర్వాత తన వైఫల్యాలను, తన కుమారుడి దందాలను కప్పిపుచ్చుకోవడానికి తమ ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా తన మీడియాతోనే ప్రచారం మొదలెట్టిన ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ది ఉంటే ఏ కలెక్టర్ల, ఎస్పీల సమావేశంలో తమ టీడీపీ పార్టీ వారు చెప్పిందే చేయాలని చెప్పినట్లు, తప్పు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరించాలని, వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ సమానమేనని వైయస్ జగన్‌లాగా చెప్పాలి’’ అని ఆర్కే రోజా ట్వీట్ చేశారు.