వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు నమోదైంది. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమెపై తిరుమల వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 7న మాధురి, దువ్వాడ శ్రీనివాస్ తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల కొండపై మాధురి ఫొటోషూట్, రీల్స్ చేశారు. అయితే, ఆ రీల్స్ ఇప్పుడు దివ్వెల మాధురిని చిక్కుల్లోకి నెట్టింది.
ఆలయం ఎదుట ఆమె రీల్స్ చేయడంపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. ఇది టీటీడీ నిబంధనలు, ఆలయ సంస్కృతిని ఉల్లంఘించడమేనని పలువురు భక్తులు, టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయం వద్ద ఫొటో షూట్ చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకుంటూ సహజీవనం చేస్తున్నామని ఆమె వెల్లడించారు. దీని ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ అధికారి ఎం.మనోహర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం వ్యవహారం గత రెండు నెలలుగా ఏపీ వ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది. తమ ఇంట్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి అక్రమంగా ఉంటున్నారంటూ దువ్వాడ భార్య, పిల్లలు ఇంటి ముందు నిరసన చేపట్టారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైసీపీ కూడా దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టింది. టెక్కలి ఇంఛార్జ్ పదవి నుంచి సైతం తప్పించింది. ఇక తన భార్య చేసిన న్యూసెన్స్‌కు దువ్వాడ శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలోనే మాధురి, శ్రీనివాస్ ఈనెల 7న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం తాము సహజీవనం చేస్తున్నామని.. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చే వరకూ కలిసే ఉంటామని చెప్పారు. శ్రీనివాస్ విడాకుల కోసం అప్లయ్ చేసుకున్నారని.. విడాకులు రాగానే పెళ్లి చేసుకుంటామని చెప్పారు. ఈ కామెంట్లపై టీటీడీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెపై కేసు నమోదు చేశారు.