శనివారం(అక్టోబర్ 12న) దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అది క్రమంగా పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనున్నట్లు అధికారులు తెలిపారు. అల్పపీడనం బలపడి క్రమంగా వాయుగుండం మారి తుపానుగా ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రభావం నుంచి ఇంకా కోలుకోక ముందే మరో తుపాను ఉగ్రరూపం దాల్చుతుందన్న వార్త హడలెత్తిస్తోంది. అయితే తాజాగా ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి అక్టోబర్ 14 నుంచి 16 మధ్య కోస్తా, రాయలసీమ జిల్లాలు సహా తెలంగాణపైనా ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.