శ్రీ సత్యసాయి జిల్లా, చిలమత్తూరు మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. దసరా పండగ వేళ ఓ దుండగుల ముఠా అత్తాకోడళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి తెగపడ్డారు. తెల్లవారుజాము సమయంలో కత్తుతో బెదిరించిన నలుగురు వ్యక్తులు తండ్రికుమారుడిపై దాడి చేసి వారి భార్యలపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై మంత్రి సవిత సీరియస్ అయ్యారు. నిందితులను పట్టుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన నలుగురు సభ్యుల ఓ కుటుంబం చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామం వద్ద పేపర్ మిల్లు కర్మాగారంలో వాచ్‌మెచ్‌గా పని చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున రెండు ద్విచక్రవాహనాలపై నలుగురు దుండగులు ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. అయితే దసరా సందర్భంగా కంపెనీకి సెలవు ఇచ్చారు.
సెలవు కదా.. ఎవరో వచ్చారంటూ వారిని పలకరించే పయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా కత్తులతో దుండగులు దాడికి తెగబడ్డారు. తండ్రికుమారుడిని తీవ్రంగా గాయపరిచి అత్తా, కోడలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ పైశాచిక ఆనందం తీరిన తర్వాత అక్కడ్నుంచి పరారయ్యారు. రాత్రి వేళ కావడంతో వారి ఆగడాలను అడ్డుకునేందుకు ఎవరూ లేకుండా పోయారు.దుండగులు వెళ్లిపోయిన తర్వాత తమపై జరిగిన దారుణ ఘటనపై బాధితులు చిలమత్తూరు పోలీసులను ఆశ్రయించారు. అత్యాచారం, దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. ఘటనపై సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సీరియస్ అయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను వెంటనే పట్టుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరారు. వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఎస్పీకి చెప్పారు. మరోవైపు అత్యాచార ఘటనను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్రంగా ఖండించారు. పండగ వేళ ఇలాంటి దారుణం హేయమైన చర్య అని ఆమె అన్నారు. కుటుంబాన్ని బంధించి ఆడవారిపై అత్యాచారం చేయడం క్షమించరాని నేరమని మంత్రి ఆగ్రహించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఎస్పీని ఆదేశించారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కామాంధులను ఎట్టి పరిస్థితిల్లో వదిలిపెట్టేది లేదని మంత్రి సవిత హెచ్చరించారు.