ప్రధాని మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. "ప్రధాని మోదీతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలా అని తరచూ వెళ్లి కలవలేను. కోనసీమలో రైల్వే కూత వినిపించాలని ప్రజల కోరిక. బాపట్ల, మచిలీపట్నం, కోనసీమ ప్రాంతాల సమస్యలను మోదీ దృష్టికి తీసుకెళ్తా. నేను మాట ఇస్తే నిలబడే వ్యక్తిని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కొన్ని సమస్యలు చెప్పారు. అందరిలా చేసేద్దాం అని మాటలు చెప్పను. అందుకే అధికారులతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం వెతుకుతాను. ఓజి ఓజి అంటూ అభిమానులు నినాదాలు చేస్తున్నారు. నాకు చాలా కాలం ఓజి అంటే మోదీ అని వినిపించేది. ఆ తరువాత ఓజి అని అర్థం అయ్యింది. ముందుగా రోడ్లు, మన ప్రాంతాలు బాగు చేసుకుందాం.
ఆ తరువాత వినోదాన్ని ఆస్వాదిద్దాం. నాయకుడిగా, హీరోగా నన్ను అభిమానిస్తారు. నాతోటి హీరోలందరిలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. అందరు హీరోలు బాగుండాలి, మంచి సినిమాలుచేయాలి. ముందు బాధ్యతతో పని చేయాలి. ఆ తరువాత వినోదం తప్పకుండా ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో ప్రజల సమస్యలే అజెండాగా ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు. ఊరి అభివృద్ధి కోసం జరుపుకుంటున్న పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి చూస్తాం. పవన్ కళ్యాణ్ దగ్గరే డబ్బులు ఉన్నాయని చంద్రబాబుకు అధికారులు చెప్పారట. నేను ఆరా తీస్తే ... ఉపాధి హామీ పథకం ద్వారా ఏడాదికి వచ్చే రూ.పది వేల కోట్ల నిధుల గురించి మాట్లాడినట్లు తెలిసింది" అని పవన్ అన్నారు. కంకిపాడులో రూ. 91 లక్షలతో నిర్మించే 11 సిమెంటు రోడ్లు, రూ. 4.15 లక్షలతో రెండు గోకులాలు, పునాదిపాడులో రూ.54 లక్షలతో రెండు సిమెంటు రోడ్ల నిర్మాణానికి పవన్‌కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.