అల్పపీడనం, తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, జేసీ కార్తీక్ తీర ప్రాంతాలు, పెన్నా తీరంపై ప్రత్యేక దృష్టి సారించారు. మత్స్య కారులు సముద్రంలో చేపల వేటకి వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు. వేటకి వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని ఆదేశించారు.బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపాన్ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని కలెక్టర్ ఆనంద్ చెప్పారు.
ఆదివారం ఆయన వెబెక్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలు. తుఫాన్ వచ్చినట్లయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడా నికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.