బీజేపీ కార్పొరేటర్ కుమారుడికి.. పాకిస్థాన్‌కు చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. అయితే, ఈ వివాహం అనివార్య పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో జరగడం విశేషం. ఉత్తర్ ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు తహసీన్ షాహిద్ పెద్ద కుమారుడు మహ్మద్ అబ్బాస్ హైదర్‌కు.. లాహోర్‌కు చెందిన అమ్మాయి ఆండ్లీప్ జహ్రాతో పెళ్లి ఖాయమైంది. లాహోర్‌లో నిఖా జరగాల్సి ఉండగా.. వరుడు షాహిద్ వీసా కోసం దరఖాస్తు చేశాడు. కానీ, భారత్, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదాల కారణంగా అతడికి వీసా మంజూరు కాలేదు. ఇదే సమయంలో వధువు తల్లి యాస్మిన్ జైదీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి.. ఐసీయూలో చికిత్స పొందుతోంది.
దీంతో వారి పెళ్లికి మరింత ఆటంకంగా మారింది. ఈ క్రమంలో వివాహాన్ని ఆన్‌లైన్‌లో జరిపించాలని భావించారు. ఇందుకు వధువు తరపువారు కూడా అంగీకారం తెలపడంతో ఆన్‌లైన్‌లోనే పెళ్లి తంతుని ముగించారు. శుక్రవారం రాత్రి ఆన్‌లైన్‌లో నిఖా జరిగింది. షాహిద్ కుటుంబ సభ్యులు, లాహోర్ నుంచి వధువు కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొని, మత సంప్రదాయం ప్రకారం నిఖా పూర్తిచేశారు. ఈ వివాహంపై షియా మత పెద్ద మౌలానా మహఫూజుల్ హసన్‌ఖాన్ మాట్లాడుతూ. ఇస్లాంలో నిఖాకు స్త్రీ అంగీకారం చాలా ముఖ్యమని, తన సమ్మతిని ఆమె మౌలానాకు తెలియజేస్తుందని చెప్పారు.
ఇరువైపుల మౌలానాలు కలిసి వేడుకను నిర్వహించగలిగినప్పుడు ఆన్‌లైన్‌లో నిఖా సాధ్యమవుతుందని ఆయన వివరించారు. హైదర్ భార్య జహ్రాకు ఎటువంటి ఆటంకం లేకుండా భారత్ వీసా వస్తుందని భావిస్తున్నామని అన్నారు. కాగా, ఈ ఆన్‌లైన్ వివాహానికి బీజేపీ ఎమ్మెల్సీ బ్రిజేశ్ సింగ్ ప్రిషూతో పాాటు ఇతర నాయకులు హాజరైన.. వరుడు కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి సమయంలోనూ వర్చువల్‌గా వివాహాం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. లాక్‌డౌన్ వల్ల రవాణా వ్యవస్థ ఆగిపోవడం.. ఆంక్షలతో ఆన్‌లైన్‌లో పెళ్లి తంతు జరిపించేశారు. గతేడాది హిమాచల్ ప్రదేశ్‌లో ఓ జంట కూడా ఇలాగే పెళ్లి చేసుకుంది. భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జంట.. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం ఆన్‌లైన్‌లో వివాహం జరుపుకున్నారు. కోట్‌ఘర్ ప్రాంతానికి చెందిన ఆశిష్ సింఘా, కులు జిల్లా భుంతార్ ప్రాంతానికి చెందిన శివానీ ఠాకూర్‌తో వివాహం ఖాయమైంది. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. కానీ, ఇంతలోనే భారీ వర్షాలు కురిసి, కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో వర్చువల్‌గా పెళ్లిచేసుకున్నారు.